Review: Enno Rangula Tella Kiranam

Enno Rangula Tella Kiranam
Enno Rangula Tella Kiranam by Sirivennela Seetharama Sastri
My rating: 4 of 5 stars

గీతరచయితగా సుప్రసిద్ధుడైన “సిరివెన్నెల” రాసిన ఏడు కథలున్న పుస్తకం ఇది. కథనంలో క్రియేటివిటీ కనిపిస్తుంది ప్రతి కథలోనూ. ఫిలసాఫికల్ డెప్త్, కవిత్వం, లేదా ఏదో రకమైన భాషాచమత్కారం కనిపిస్తుంది చాలా వాక్యాల్లో. మొదటి కథ “మహాశాంతి” ని 28 సార్లు తిరగరాశారంటేనే సిరివెన్నెల రచనాసాధన ఎంతటిదో తెలుస్తుంది. ఈ మధ్య వచ్చిన కంచె చిత్రానికి సిరివెన్నెల రాసిన పాటలకి వ్యాఖ్యానం ఈ కథలో దొరుకుతుంది. నాకు బాగా నచ్చిన కథ ఇదే! జీవితమంటే బాధా, ఆనందం, సౌఖ్యం, నవ్వూ, ఏడుపూ ఇలా ఎన్నో “రంగులు” కలిసిన తెల్ల కిరణమనీ, జీవితంలోని అన్ని పార్శ్యాలనీ అంగీకరించి ఆస్వాదించగలిగినప్పుడే పరిపూర్ణంగా జీవించగలమని తెలియజెప్పే “ఎన్నో రంగుల తెల్ల కిరణం” కథ ఎన్నదగినది. “కామన్ మేన్” మనస్తత్త్వాన్ని తేలిక మాటలతో విశ్లేషించే కథలు – “మరో సింద్బాద్ కథ”, “ఇదో తిరుగుబాటు కథ”, “కార్తికేయుని కీర్తికాయం” అన్నవి. ఒక ఆత్మీయుడు మనతో సంభాషించినట్టు ఉన్నాయి. శిల్పం బావున్నా, గొప్ప డెప్త్ ఉన్నా, ఏదో లోటు ఉందనిపించి కాసింత అసంతృప్తి కలిగించే కథలు – “చరిత్ర చోరులు”, “పోస్ట్ మార్టం” అన్నవి. రెండూ సమాజంపై చేసిన లోతైన విశ్లేషణలే.

కూర్చుంటే ఓ గంటలో చదవేయగలిగే చక్కని కథల పుస్తకం ఇది!

View all my reviews

Advertisements

జలంధర కథలు – ఓ అద్భుతమైన బ్రతుకు పుస్తకం

ఇప్పటి వరకూ నేను ఎన్నో కథల పుస్తకాలు చదివాను. అయితే ఈ కథల సంపుటిలా నన్నేదీ కదిలించలేదు, ఆలోచింపజేయలేదు. అసలు జలంధర ఎవరో కూడా చాలా మందికి తెలియదు. ఈవిడ పేరు పొందిన గొప్ప కథా రచయిత్రి ఏమీ కాదు. అయితేనేం, ఈవిడ నా మటుకు గొప్ప రచయిత్రే.

జలంధర సినీనటుడు చంద్రమోహన్ భార్యని నాకు తెలుసు. మంచి సాహితీ అభినివేశం ఉన్న మా నాన్నమ్మగారికి జలంధర గారు తెలుసు. కాబట్టి జలంధర గారు తన కథల పుస్తకం మా నాన్నమ్మగారికి ఇవ్వడం, ఆ పుస్తకం మొన్న పాలకొల్లు మా నాన్నమ్మగారి ఇంటికి వెళ్ళినప్పుడు నా కంటపడడం జరిగాయి. అలా ఓ గొప్ప పుస్తకం చదివే భాగ్యం కలిగింది.

ఏవో coffee table కథలు అయ్యుంటాయిలే అనుకుని చదవడం మొదలెట్టిన నాకు ఈ కథల్లో బ్రతుకు గురించి గొప్ప తాత్త్వికమైన పరిశీలనా, విశ్లేషణా కనిపించాయి. అంతే, పడుకుని చదువుతున్న వాణ్ణి కాస్తా లేచి కూర్చున్నాను. ఎన్ని సార్లు కళ్ళు చెమర్చాయో, ఎన్ని సార్లు ఈ పుస్తకం మూసేసి ఆలోచనల్లోకి జారిపోయానో లెక్కలేదు. ఎన్నో సార్లు ఈ పుస్తకం వదిలి పారిపోవాలనిపించింది ఎందుకంటే అద్దంలో మనని మనం నిజంగా చూసుకోడానికి దమ్మూ ధైర్యం ఉండాలి. మనలోని అహంకారాలనీ, విశ్వాసాలనీ, అవినీతినీ, స్వార్థాలనీ మనమే ఒప్పుకోవడం అంత ఈజీ ఏమీ కాదు, అందుకే వీటి గురించి అట్టే ఆలోచించకుండా ఒక రకమైన escapism లో బ్రతుకుతూ ఉంటాం. ఈ పుస్తకం నేను ఏర్పరుచుకున్న status లూ, false prestige లూ, వేసుకున్న ముసుగులూ ఇవన్నీ ఎండగడుతూ ఉంటే నేను మర్చిపోయిన అసలైన నేనేదో అస్పష్టంగా కనిపించింది. Of course , ఇలాంటి foolish thoughts చెయ్యడమేంటని ఈ పుస్తకం చదివిన వెంటనే ఈ ఆలోచనలని కప్పెట్టేశాననుకోండి! (చూశారా, జలంధర గారు! మీ కథలు entertainment కి మాత్రమే పనికొచ్చి, ఇంక నన్నేమీ చెయ్యకుండా ఎలా జాగ్రత్తపడ్డానో. చంద్రమోహన్ గారు మీ కథలు చదివి, అర్థం కాలేదన్నారని ముందుమాటలో రాశారు. అది అర్థం కాకపోవడం కాదు, ఎక్కడ అర్థమైపోతుందో అని భయపడడం. అందుకే మీ కథలని సాధ్యమైనంత దూరంగా ఉంచుతాం)

జలంధర గారిపై జిడ్డు కృష్ణమూర్తి ప్రభావం కొంత ఉన్నట్టు తోచింది. అయితేనేం చెప్పిన విషయాన్ని స్పష్టంగా సరళంగా చెప్పగలిగారు. కథాంశాల్లో కూడా నవ్యత ఉంది. సంఘంపైన బాధ్యతా, అవగాహనా కనిపిస్తాయి. యండమూరి కథలు కొన్ని ఎమెస్కోవారు ప్రచురించారు. వాటిలోనూ కొన్ని ఫిలాసఫీ, సైకాలజీ కలిపిన కథలు ఉన్నాయి. అయితే ఈ జలంధర కథా సంపుటిలో అన్నీ ఫిలసాఫికల్ కథలే. అంటే కూర్చోపెట్టి జీవితం, పరమార్థం అంటూ ఉపన్యాసాలు కూడా ఏమీ ఉండవు. చాలా మాములు జీవితసంఘటనలు తీసుకుని కథలు అల్లి, కథనం ఎంతో ఆసక్తికరంగా నడిపిస్తూ అంతర్లీనంగా ఫిలాసఫీ చొప్పించడం జలంధర గారి లక్షణం. కాబట్టి ఈ కథలు ఎవరైనా చదవొచ్చు, ఎంతో కొంత వినోదం పొందొచ్చు. కావాలంటే కొంత ఆలొచించొచ్చు, ఇంకా ధైర్యం ఉంటే మిమ్మల్ని మీరు మార్చుకోవచ్చు.

కొన్ని కథలని ఉదహరిద్దామనుకున్నాను కానీ, ఏ కథకి ఆ కథే గొప్పగా ఉంది. అందుకే మచ్చుకి కొన్ని వాక్యాలు ఉదహరిస్తాను

  1. జీవితానికి కావలసింది మనస్సే, టీచర్! కానీ అదొక్కటే చాలదు. ఆడపిల్లకు అసలు సరిపోదు కానుక కథ
  2. ఇంత చక్కటి తీయని అనుభూతులు మళ్ళీ ఉండవు. మనిషి ప్రవర్తన పరిస్థితులకు ఎప్పుడూ కట్టుపడాలి. అందుకే అశాశ్వతమైన ప్రపంచంలో ప్రతిక్షణం శాశ్వతం కావాలనుకోవడం పిచ్చితనం. ఈ క్షణంలోని భావాలు, రేపు మళ్ళీ మనకుండవు. అలాంటప్పుడు అవి కోరికలతో మలినమై గాయాల్లా జ్ఞాపకానికి రాకూడదు అగ్నిపుష్పం కథ
  3. కేవలం నువ్వు ఎలా ఉంటావో అన్నదే ముఖ్యమైనప్పుడు, అద్దంలో చూసుకుంటూ నిన్ను నువ్వు పోగొట్టుకుంటావు. ఈ జన్మలో నీకు నువ్వు దొరకవు తేజస్విని కథ
  4. ఔన్నత్యం అనేది ఒక విక్రమార్క సింహాసనం. పలికితే తప్ప పలకని సాలభంజికలు ఎన్నో. కదిలిస్తే కథలు చెబుతాయి. అధికారమే ఔన్నత్యమనుకుని పాపపు పాదాలతో ఈ అధికారసోపానాలు ఎక్కితే, అవి కన్నీరు కారుస్తాయే కానీ కథలు చెప్పవు సాలభంజిక కథ
  5. చాలా మంది ప్రేమిస్తున్నాం అనుకునేవాళ్ళు అసలు ఎందుకు ప్రేమిస్తున్నామో, ఏ గుణం ఎదుట మనిషిని గొప్ప మనిషిగా, విలక్షణమైన వ్యక్తిగా రూపుదిద్దుతోందో చెప్పలేరు పిచ్చితల్లి కథ
  6. కానీ ఏదో ఒక తృప్తి. అది ఆత్మకు సంబంధించింది. నేను జీవితానికి తృప్తి అని నేను అనుకున్న భావనకి దూరమైనా, మానసికమైన ఏదో తెలియని ప్రశాంతత, ఏనాడూ నాకు అర్థం కానిది నా జీవితాన్ని ఆవరించింది వియద్గంగ కథ

మిథునం

నాకు తెలుగు కథలు చదవడం అంటే చాలా ఇష్టం ఉండేది. ఈ మధ్య కొంత తగ్గిందనే చెప్పొచ్చు. అంతకు ముందు ఈనాడు ఆదివారం పుస్తకం కథలని చాలా ఆసక్తిగా చదివే వాడిని, ఇప్పుడైతే చదవ బుద్ధే కావడం లేదు. ఈనాడు కథలు వేస్ట్, తెలుగులో గొప్ప కథలు చాలా ఉన్నాయ్, అవి చదవండి – అని మీరు అనొచ్చు. అలాటివీ నేను చదివాను. కాని చెప్పానుగా, ఈ మధ్య గొప్పవి కూడా నన్ను ఆకర్షించట్లేదు.

ఇలాటి నన్ను "మిథునం" కథల సంపుటి బాగా ఆకట్టుకుంది. రచయిత శ్రీరమణ. ఈయనని ఎప్పుడూ నేను ముళ్ళపూడి వెంకటరమణతో confuse అయ్యే వాడిని. ఈయన రాసిన హాస్యం నిండిన వ్యాసాలూ అవీ చదివాను. మిథునం గురించి మిత్రుడు కిరణ్ చెప్తే కొన్నాను. అది ఒక నవల అనుకున్నాను, కొని తెరిచాక తెలిసింది కథల పుస్తకం అని. ఇందులో 8 కథలు ఉన్నాయ్. అన్నీ 1994-1997 మధ్య రాసినవే, ఆంధ్ర ప్రభ, ఆంధ్ర పత్రిక, రచన మొదలైన పత్రికల్లో వచ్చాయట.

మిథునం ఆఖరి కథ. ఈ కథ చదివి బాపూ తన స్వదస్తూరీతో కథంతా రాసి శ్రీ రమణని ఆశీర్వదించారని, రచన పత్రికలో బాపూ దస్తూరీతో ఉన్న కథ రెండు సార్లు ప్రచురించారనీ ఉంది. సో high expectations ఏర్పడ్డాయ్ చదవక ముందే. తీరా చదివాకా నిరుత్సాహం కలుగుతుందేమో అన్న అనుమానం వచ్చింది కూడా. కథ ఇద్దరు ముసలి దంపతుల అనుబంధం గురించి. వాళ్ళ పెంకుటిల్లు, చుట్టూ ఉన్న మొక్కల గురించి వర్ణన అద్భుతంగా తోచింది. ఈ హైదరాబాదులూ, బాధలూ, ఫ్లాటులూ వదిలి అక్కడికి పారిపోవాలనిపించింది. వృద్ధ దంపతులు ఇద్దరూ ఒకరినొకరు దెప్పిపొడుచుకోడాలూ, కోప్పడ్డాలూ, తగువు పడడాలూ ఇవన్నీ ఒకింత హాస్యంతో రచయిత రక్తికట్టించారు. అన్యోన్య దాంపత్యం అంటే ఇలా ఉండాలి అని లెక్చరు ఇవ్వకుండా ఆ ముసలి దంపతుల దైనందిక జీవితాన్ని చూపిచి మనకి చెప్తారు. కథ చదివి మనసు ఆర్ద్రతతో నిండిపోయి కళ్ళు చెమర్చాయి. ఎన్నాళ్ళైందో ఇలాటి కథ చదివి. మనం మనుషులం అని తెలుసుకునేందుకు, గుర్తుచేసుకునేందుకు ఇలాటి కథలు చదవాలి. శ్రీరమణ ధన్యుడు.

మిథునం కథ అంత స్పందింపజేసి కంటితడి తెప్పించిన కథ "బంగారు మురుగు". ఒక బామ్మా – మనవడి అనుబంధాన్ని గొప్పగా ఆవిష్కరించిన కథ. "దయ కంటే పుణ్యం లేదు, నిర్దయ కంటే పాపం లేదు" అని బామ్మ చేత పలికించి భక్తి ముసుగులో మానవతని మరిచిపోతున్న మనుషులకి ఒక చురక తగిలిస్తారు రచయిత. భగవద్గీతని బట్టీ పట్టి ఉపన్యాసాలు దంచి అమాయకులని వలలో పడేసి వారి సంపదలతో తాము భోగభాగ్యాలు అనుభవించే స్వాముల పైనా సున్నితమైన విమర్శ ఉందీ కథలో.

"అరటిపువ్వు సాములోరు" కథలో అరటి పువ్వుని ఉదాహరణగా తీసుకుని ప్రజలకి మంచినీ, వేదాంతాన్ని బోధించే స్వామీజి కనిపిస్తాడు. "అరటి పువ్వు" లో తాత్త్వికతని ని రెండు మూడు రకాలుగా వర్ణించడంలో రచయిత imagination కనిపిస్తుంది.

"తేనెలో చీమ" కథ పెద్దోళ్ళు తమ స్వార్థం కోసం పేదోళ్ళని ఎలా వాడుకుంటారో నాటకీయంగా తెలిపే కథ. బక్కగా పుల్లలా ఉన్నోడిని ఊరి ప్రెసిడెంటు తొమ్మిది నెలల్లో వస్తాడులా చేసి 100 మినుముల బస్తాలు ఇట్టే మోయిస్తానని సవాలు చేస్తాడు. తమ పరవూ పంతం కోసం ప్రజలని పావుల్లా వాడే రాజకీయనాయకులు ఈ కథలో దర్శనమిస్తారు.

"వరహాల బావి" కథలో రగిలే అగ్ని పర్వతంలా ఉన్న మన సామాజిక వ్యవస్థ కనిపిస్తుంది. పైపైన కలిసున్నా లోలోపల మనలో పేరుకుపోయిన విభేదాలు ఎన్నో! కులం, మతం, ప్రాంతం ఇలా ఏ పేరు చెప్పైనా ఎవరైనా మనని రెచ్చగొట్టచ్చు. ఈ కథలో చిన్న గొడవ పెరిగి, హిందూ ముస్లిముల మధ్య పెను అగాధం సృష్టించి చివరికి ఊరికి ప్రాణాధారమైన బావినే కబళించే పెను ప్రమాదంగా ఎలా మారుతుందో చూడొచ్చు.

"ధనలక్ష్మి" ఆసక్తికరమైన కథ. కొందరికి చదువులేక పోయినా వ్యాపార లౌక్యం ఉంటుంది. పైకి సాదాసీదాగా కనిపించే ఇల్లాలు అతి పేద స్థితి నుంచీ పిండి మిల్లుతో ప్రారంభించి పెద్ద మేడ ఎలా కట్టిందో తెలిపే కథ ఇది. మొగుడికి లొంగుతున్నట్టే అనిపించి, అతని చేత తమకి కావలిసిన పనినే చేయించుకునే తెలివి తెలియాలంటే అమ్మాయిలు ఈ కథ చదవగలరు!

ఒక సోడా బండి వాడి గురించి చెప్తూ కూడా ఆసక్తికరమైన కథ రాయొచ్చు అని నిరూపించే కథ "షోడా నాయుడు". ఆ రోజుల్లో షోడ బళ్ళతో ముడిపడ్డ గ్రామ వ్యవస్థనీ, పరస్పర ఆప్యాయతలనీ, మంచితనాలని ఈ కథలో చూడొచ్చు. సోడా లో గోళీలు కావాలని రచయిత నాయుడు చుట్టూ తిరిగిన వైనం చదివితే నా చిన్నప్పటి సంగతులు కొన్ని గుర్తొచ్చాయ్. ధన పరంగా విలువలేని వాటిని, ఎద పరంగా ఎంత అపురూపంగా దాచుకున్నామో కదా చిన్ననాడు!

"పెళ్ళి" కథలో రాజకీయ, ప్రభుత్వోద్యోగ రంగాల్లో పేరుకుపోయిన soft corruption పైన ఒక వ్యంగ్యం కనిపిస్తుంది. కథ అంతా సంభాషణగానే సాగడం ఇందులో ప్రత్యేకత.

మొత్తానికి "మిథునం" చాలా మంచి కథల పుస్తకం. చదవడం గొప్ప అనుభూతి మిగిల్చింది.